వాహనాలు నడిపే డ్రైవర్లు ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు చేయించుకోవాలని గూడూరు రోడ్డు రవాణా శాఖ అధికారి జీ. ఆదినారాయణ సూచించారు. శుక్రవారం సాయంత్రం గూడూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఐదవ రోజు శుక్రవారం బస్సు డ్రైవర్లు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలన్నారు. బస్సులో ప్రయాణించే సమయంలో విద్యార్థులు కిటికీలలో తల, చేతులు పెట్టకూడదన్నారు. డ్రైవర్లు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది తప్పనిసరిగా హెల్త్, అడ్రస్ కు సంబంధించిన కార్డులు వారి వద్దనే ఉంచుకోవాలన్నారు. ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడ్, కార్బన్ డైయాక్సైడ్ సిలిండర్ సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతినెలా వాటి సామర్థ్యాన్ని పరీక్షించాలన్నారు. వాహనాలను అపరిమిత వేగంతో నడపకూడదన్నారు. తల్లిదండ్రులు ప్రతినెలా ఒకసారి కళాశాల యాజమాన్యంతో సమావేశమై విద్యార్థుల రక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాలు కండిషన్ లో ఉండేలా కళాశాల యాజమాన్యం, డ్రైవర్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో ఆదిశంకర కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఏ. మోహన్, ప్రిన్సిపల్స్, ఆర్టీఓ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.