గూడూరు : భూ యాజమాన్య హక్కు చట్టం ప్రమాదకరమని రైతు సంఘం జిల్లా నాయకులు సీవీఆర్. కుమార్ అన్నారు. ఆదివారం గూడూరు సీపీఐ కార్యాలయం ఎదుట భూ యాజమాన్య హక్కు చట్టం 512 జీఓ ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో భూ సమస్యలు న్యాయ శాఖ పరిధిలో ఉండేవన్నారు. ఈ నూతన చట్టంతో రెవెన్యూ ఉన్నతాధికారులే భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. దీంతో కేవలం పెత్తందారులు, భూస్వాములను లాభం చేకూరుతుందన్నారు. చిన్న, సన్నకారు రైతులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సీహెచ్. ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఈ చట్టం ఎక్కడా అమలు చేయకపోయినా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసేందుకు ముందుకురావడం దురదృష్టమన్నారు. రైతులకు ఇబ్బందికరంగా ఉండే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో వైసీపీ రానున్న ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు. సీపీఐ నియోజకవర్గ, పట్టణ కార్యదర్శులు జీ. శశికుమార్, షేక్. కాలేషా మాట్లాడుతూ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, రైతు సంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం 512 జీఓ ప్రతులను బోగి మంటల్లో దగ్ధం చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కే. నారాయణ, ఎంబేటి చంద్రయ్య, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్. జమాలుల్లా, రైతు షేక్. బాషా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.