Advertisements

కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్‌.1 కేసులు

తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్‌.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను తొలుత లక్సెంబర్గ్‌లో గుర్తించారు. ఆ తర్వాత జేఎన్‌.1 కేసులు యూకే, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, అమెరికాలో కూడా వెలుగు చూశాయి. తాజాగా ఈ సబ్‌వేరియంట్ జేఎన్‌.1 కేసు భారతదేశంలోనూ వెలుగు చూసింది. తాజాగా జేఎన్‌.1 కేసు కేరళలో నిర్ధారితమయ్యింది. దీంతో కేరళ వైద్యశాఖలో మరోమారు ఆందోళనలు కమ్ముకున్నాయి.

ఈ నేపధ్యంలో కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందినది. దీనిని ‘పిరోలా’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, జేఎన్‌.1, బీఏ.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.

జేఎన్‌.1 లక్షణాలు
సీడీసీ తెలిపిన ప్రకారం కరోనాలోని ఈ కొత్త సబ్‌వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతర దగ్గు
త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ప్రస్తుతానికి జేఎన్‌.1కి సంబంధించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. సీడీసీ అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండటాన్ని గమనిస్తే, ఇది మన రోగనిరోధక వ్యవస్థ నుండి సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు. ఇతర కరోనా వేరియంట్‌ల కంటే జేఎన్‌.1 ప్రమాదకరమా కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ చెబుతోంది.

Leave a Comment