Advertisements

గూడూరు హైస్కూళ్లలో ఉర్దూ సెక్షన్ ఏర్పాటు చేయాలి

గూడూరు : గూడూరు పట్టణంలోని సీఎస్ఎం, జీఎస్ఆర్ఎం, జెడ్పీ  బాలికల ఉన్నత పాఠశాలల్లో ఉర్దూ సెక్షన్ ఏర్పాటు చేయాలని
కోరుతూ శనివారం ఎంఈఓ, హైస్కూల్ హెచ్ఎంలకు ఇన్సాఫ్ సమితి సభ్యులు, సీపీఐ నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్. జమాలుల్లా మాట్లాడుతూ
గూడూరు పట్టణంలో ముస్లిం జనాభా అధికంగా ఉందన్నారు. పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మాత్రమే ఉర్దూ ఒక సబ్జెక్టుగా చదివే అవకాశం ఉందన్నారు. చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ హైస్కూల్, రెండవ పట్టణంలోని జీఎస్ఆర్ఎం, జెడ్పీ బాలికల హైస్కూళ్లలో ఉర్దూ ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉందని,    హైస్కూల్ స్థాయిలో లేదని దీంతో తల్లిదండ్రులు దూరంగా ఉన్న స్కూళ్లకు పిల్లలను పంపలేక చాలామంది విద్యార్థులు ఇతర సబ్జెక్టులు అయిష్టంగానే తీసుకుంటున్నారని అన్నారు.

అలాగే కొంతమంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోతున్నారన్నారు. ముఖ్యంగా బాలికలు బడికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎస్ఎం, జీఎస్ఆర్ఎం, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 35 నుండి 40 శాతం వరకూ ముస్లిం విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎస్ఎం, జీఎస్ఆర్ఎం, జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలల్లో ఉర్దూ సెక్షన్ ఏర్పాటుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్ మాట్లాడుతూ గూడూరులో అధిక ముస్లిం జనాభా, విద్యార్థులు ఉండడంతో  హైస్కూళ్లలో ఉర్దూ సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇన్సాఫ్ సమితి డివిజన్ నాయకులు షేక్. రఫీ మాట్లాడుతూ ముఖ్యంగా ఉర్దూ బాష హైస్కూల్ స్థాయిలో లేకపోవడం వలన బాలికలు విద్యకు దూరమవుతున్నారన్నారు. దీంతో బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గూడూరు హైస్కూళ్లలో ఉర్దూ సెక్షన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈఓలు 1, 2 సంపత్ కుమార్, కాంచనలకు, సీఎస్ఎం హైస్కూల్ హెచ్ఎం ఏ. శ్రీనివాసులు, జీఎస్ఆర్ఎం హైస్కూల్ హెచ్ఎం మునవ్వర్ బాషలకు వినతిపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఇన్సాఫ్ సమితి డివిజన్ నాయకులు మహబూబ్ అలీ, హాషింభాను, నసీర్ అహ్మద్, అబూబకర్, సల్మాన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment