తిరుపతి జిల్లా గూడూరు : పూలే స్ఫూర్తితో అణగారిన వర్గాలు రాజ్యాధికారం సాధించాలని బహుజన నాయకులు ఉద్ఘాటించారు. మంగళవారం భారత దేశ తొలి సామాజిక విప్లవ ఉద్యమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం గూడూరులో బహుజన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక తాలూకా ఆఫీస్ రోడ్డు వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాల వద్ద 133వ వర్ధంతి సందర్భంగా పలువురు బహుజన నాయకులు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బహుజన నాయకులు నాశిన భాస్కర్ గౌడ్, ఉడతా శరత్ యాదవ్ లు మాట్లాడుతూ సామాజిక న్యాయం నినాదంతో అణగారిన వర్గాల చైతన్యానికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే అన్నారు. విద్య లేని తనమే వెనుక బాటుకు కారణమని భావించి బహుజనులకు చైతన్యం కల్పించి విజ్ఞాన మార్గానికి బాటలు వేసిన మహనీయుడు పూలే అన్నారు. ముఖ్యంగా మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి అన్నారు. కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలకు పూలే అండగా నిలిచారన్నారు. భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడారన్నారు. స్త్రీలకు విద్య నిషేధం అని ప్రవచించిన మనుస్మృతిని తిరస్కరించి మహిళలకు అండగా నిలిచి వారికి కూడా సమాజంలో పురుషుల్లాగే స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని చాటిచెప్పారన్నారు. ఆయన గొప్ప మహనీయుడని కొనియాడారు. అంతకుముందు పూలే దంపతుల విగ్రహాల ఎదుట నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ తాజుద్దీన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ డివిజన్ అధ్యక్షులు గోవింద్ నాయక్, మల్లిఖార్జున, రవి నాయక్, ఇన్సాఫ్ రాష్ట్ర సమితి ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.