Advertisements

అండమాన్ పరిసరాల్లో ఈ నెల 26న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం

అండమాన్ పరిసరాల్లో ఈ నెల 26న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ పరిసరాల్లో ఈ నెల 26న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. 27నాటికి అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.

అనంతరం పశ్చిమ- వాయువ్య దిశగా కదిలి 29 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుతుండగా బలపడుతుందని పేర్కొంది. మరో వైపు ఏపీలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయి.

రెండు రోజులు వర్షాలు: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఏపీలో దిగువ ట్రోపో ఆవరణలో వీస్తున్న గాలుల ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అన్నమయ్య జిల్లా కలకడలో 62.2 మిల్లీ మీటర్లు, ఏలూరు జిల్లా నూజివీడులో 36.8, అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో 28.2, బాపట్లలో 24.2, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 22.8, విజయనగరం జిల్లా ఎస్ కోటలో 21.4, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 20.4 , ప్రకాశం జిల్లా వెలిగండ్లలో 18.4, బాపట్ల జిల్లా రేపల్లెలో 18.2, బాపట్ల జిల్లా కారంచేడులో 18.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

పెరుగుతున్న చలి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు/ ఆగ్నేయ దిశలో 6-10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

గురు, శుక్రవారాల్లో కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సగటున పగటిపూట 28-32 డిగ్రీల మధ్య, రాత్రిపూట 17-19 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Leave a Comment