Advertisements

కోట రోడ్లపై ప్రయాణమంటే.. నరకం చూడాల్సిందే..!

కోటలో గత 6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రోడ్లను ఛిద్రం చేశాయి. నీళ్లు నిలిచి.. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గుంతల దారుల్లో ప్రయాణం.. వాహనదారులకు నరకం చూపిస్తోంది. మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. కోట లోని  దాదా రాయి గుంట వద్ద నుండి కోటమ్మ గుడి వద్ద కు మరియు కోట లోని కొడవలూరు సుబ్బారెడ్డి, ధనుంజయ్య రెడ్డి  ఇంటి వద్ద నుండి   దళిత వాడ వరకు రోడ్డు వేయాలని అందుకు రోడ్డు వెడల్పు చేసేందుకు రోడ్డును తవ్వి అలాగే వదిలేయటంతో పట్టణంలోని రోడ్లు మరింత అధ్వానంగా మారాయని స్థానికులు వాపోతున్నారు.
కోట పట్టణం లో..అడుగు అడుగుకో గుంత.. ఎక్కడ జారి పడతామోననే భయం. రొడ్లు వేసేందుకు ఆర్ అండ్ బి అధికారులు రోడ్డును తవ్వి వదిలేశారు. గత మూడు నెలల నుండి నాయకులు, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే చాలు.. తమ కష్టాలు రెట్టింపు అవుతున్నాయని వాపోతున్నారు కోట పట్టణం పరిధిలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయి.  పట్టణంలో ఏ రోడ్డు చూసినా గుంతలతో దర్శనమిస్తోంది. ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. గుంతలలో నీరు నిండి ప్రమాదకరంగా తయారయ్యాయి. చిన్నారులు, వృద్ధులు.. బురద రోడ్లపై జారిపడి గాయాల పాలవుతున్నారు. ఏటా అభివృద్ధి పేరిట రూ.లక్షల నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రోడ్లు మాత్రం బాగు చేయట్లేదంటూ పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కోట మండలం పరిధిలోని కోట పట్టణంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా కోట ఎక్సట్రా మార్ట్ వద్ద నున్న రోడ్డు చెరువును తలపిస్తుంది. రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న తరుణంలో నీళ్ల లో ఉన్న గుంటలు కనిపించకపోవడంతో వాహనదారులు, పిల్లలు, మహిళలు, వృద్దులు పడిపోయి ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు గ్రామంలోని వీధులన్నీ మూడు, నాలుగు అడుగులలోతుకు చేరి ఇండ్లలోకి వస్తున్నాయన్నారు.దీని కారణంగా పలువురు డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేకసార్లు అధికారులు చెప్పినా ఏమాత్రం స్పందించలేదని వాపోతున్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి గ్రామాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, మురుగు నీరు రాకుండా చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.కోటలో చిన్నపాటి చినుకు పడినా చాలు రోడ్డంతా బురుద మయమై నడవడానికి నరకం కనిపించేలా చేస్తుంది. బురద గుంతలో ఉన్న రోడ్లలో రాకపోకలకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కోట గ్రామ పంచాయతీ, ఆర్ అండ్ బి అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేరని ప్రజలు వాపోతున్నారు. గత 6 రోజుల నుంచి కురిసిన వర్షాలతో పట్టణంలోని రహదారులన్నీ బురద గుంతలమయంగా తయారై.. వచ్చిపోయే వారికి నానా అవస్థలు తెచ్చి పెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా..  అధికారులు మాత్రం చూసీచూడనట్టు వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకవర్గం పట్టించుకుని రహదారులకు మరమ్మతులు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Leave a Comment