20 వేల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
-తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో రూ.94.75 కోట్ల నిధులతో ఇసుకమేట తొలగింపు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, దీంతో సుమారు 20 వేల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్మనున్నాయని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చెప్పారు.బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సీఎం వైఎస్ జగన్ ఇవాళ్టి సూళ్లూరుపేట పర్యటన రద్దయింది. అయితే మత్స్యకారులకు సాయం అందించే కార్యక్రమం మాత్రం వాయిదా పడలేదు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో నెల్లూరు కలెక్టర్ కార్యాలయం నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు.ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎంపీ మాట్లాడుతూ సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏడాదికి పైగా కేంద్రమంత్రిత్వశాఖలు, అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ సమన్వయం ఫలితంగా మత్స్యకారులకు బతుకులు పూర్తిగా మారనున్నాయన్నారు. అలాగే ఓఎన్జీసీ సంస్ధ పైప్‌లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఓఎన్జీసీ ద్వారా నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000, మొత్తం రూ.161.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయడం సంతోషకరమన్నారు.దాదాపు రెండు దశాబ్దాలుగా వేలాది మంది మత్స్యకార కుటుంబాలకు ఇబ్బందిగా తయారైన పులికాట్ సరస్సు ముఖద్వారం పూడిక సమస్య ఎట్టకేలకు త్వరలో పరిష్కారం కానుందని తిరుపతి ఎంపీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే మత్స్యకార దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఆయన తెలిపారు.