ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు అందుబాటులో ఉంచండి
ఎన్ సీఆర్ సీ ప్రతినిధి హరీష్ రెడ్డి
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో మహాప్రస్థానం కోసం అంబులెన్సు అందుబాటులో ఉంచండని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను రాష్ట్ర ఫుడ్ అండ్ సేఫ్టీ హెల్త్ కో-ఆర్డి నేటరు హరీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్ సీఆర్ సీ ప్రతినిధులు మంగళవారం ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి వెంకటసుబ్బయ్యను వేర్వేరుగా కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీకాళహస్తి ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అనారోగ్యంతో ఎవరైనా తుదిశ్వాస విడిచితే ప్రైవేటు అంబులెన్సులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ప్రైవేటు అంబులెన్సుల వారు రూ.వేలకు వేలు వసూలు చేస్తున్నారన్నారు. ఈ భారం పేదలు భరించలేక పోతున్నారన్నారు. కొన్ని సందర్భాల్లో పురపాలక సంఘం వారు శవాలను తరలించాల్సి వస్తోందన్నారు. ఈ దారుణ పరిస్థితులు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను ప్రతినిధుల దృష్టికి రావడంతో ముక్కంటి ఆలయ అధికారులను కలవాల్సి వచ్చిందన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రెండు అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయని… ఇందులో ఒకటి ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో మహాప్రస్థానం కోసం ఇస్తే పేదల సమస్య తీరుతుందన్నారు. మానవతా దృక్పథంతో ఆలయ అధికారులు ఆలోచించి ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్సు ఇవ్వాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ డిప్యూటీ ఈవో వెంకటసుబ్బయ్య సానుకూలంగా స్పందించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను సభ్యులకు చాలా మంచి ఆలోచన వచ్చిందని… ఇందుకు తమవంతు సహకారం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ వినియోగదారుల హక్కుల కమిషను ఏపీ డిప్యూటీ ఛైర్మన్ యల్లంపాటి కోటేశ్వరబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవగుంట భరత్ రెడ్డి, ఆర్గనైజరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.