మోడీ ఏకపక్ష ధోరణిని మార్చుకోవాలి
కృష్ణా జలాల పునః పంపిణీ నోటిఫికేషన్ రద్దు చేయాలి
కరువు సహాయక చర్యలు చేపట్టాలి
20,21న విజయవాడలో 30 గంటల నిరసన దిక్షను జయప్రదం చేయండి
గోడపత్రికలను ఆవిష్కరిస్తున్న సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు
కృష్ణా జలాల పునః పంపిణీపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ తక్షణం రద్దు చేయాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్ అన్నారు. శుక్రవారం గూడూరు ఆర్అండ్ బీ అతిథి గృహం వద్దనున్న మహనీయుల విగ్రహాల ఎదుట గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పీడిత మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని నవంబర్ 20, 21న విజయవాడలో నిర్వహించనున్న 30 గంటల నిరసన దీక్షలను జయప్రదం చేయాలని రైతులకుపిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణానది నీటి వివాదాలపై ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టుల వారీగా 811 టిఎంసిలు కేటాయించగా విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకుంటున్నాయన్నారు. మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును బ్రిజేష్ కుమార్ కాలరాయడంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తోందన్నారు. కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా, బ్రిజేష్ కుమార్ తీర్పు అమల్లోకి రాకుండానే కేంద్రంలో బిజెపి ఓట్ల కోసం రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను జఠిలం చేసి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు లేని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం కృష్ణా నీటి వివాదాలపై మూడు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కాకముందే రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు తిరిగి బ్రిజేష్ కుమార్ ట్రిబనల్ కు కట్టబెట్టడం వెనుక ఆంధ్ర రాష్ట్రానికి అందులో రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసే కుట్రలు దాగి ఉన్నాయన్నారు. కేంద్రంలో బిజెపి విభజన చట్టంలో పొందుపరిచిన హామీలకు తిలోదకాలు ఇచ్చి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు చేయకుండానే అడ్డగోలుగా నిర్ణయాలు చేయడానికి తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదు కాక 448 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తోందన్నారు. సాధారణ సాగు విస్తీర్ణానికి నోచుకోక, అరకొరగా వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సీమలు పట్టణాలకు వలస పోతున్నాయన్నారు. పశువులకు మేత లేక కబేళాలకు తరలిపోతున్నాయన్నారు. తాగునీటి ఎద్దడి ఆరంభమైందన్నారు. రాష్ట్రంలో వర్షాభావంతో పూర్తిగా కరువు ఛాయలు అలుముకున్నాయన్నారు. కేవలం 103 కరువు ప్రభావం ఉన్నదని ప్రభుత్వం ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు. గతంలో వైసీపీ శ్రేణులు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే వర్షాలు రావని, పూర్తిగా కరువు దాపురుస్తుందని చేసిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో కరువు ప్రభావం లేదని చెప్పడానికి, కరువు మండలాలను ప్రకటించకుండా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఒక్క మండలం కూడా ప్రకటించకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరువు పీడిత మండలాలను అదనంగా చేర్చి ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం, పంట సాగు వేయని రైతులకు పెట్టుబడి సహాయం అందించాలన్నారు. ప్రత్యామ్నాయ స్వల్పకాలిక పంటలకు విత్తనాలు, ఎరువులు పురుగు మందులు, పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయ యంత్రాలు సూక్ష్మనీటి సేద్యపు పరికరాలపై ఇచ్చే రాయితీని పెంచి ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు, పంట కాలువల నిర్మాణానికి, తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. నిధులు నికర జలాల సాధనకై జరుగుతున్న 30 గంటల నిరసన దీక్షలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శిఎంబేటి చంద్రయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్లు, ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్. జమాలుల్లా, హైదర్ అలీ, సురేష్, చందు తదితరులు పాల్గొన్నారు.